Sexual harassment in AP : మతం ముసుగులో సంస్థను ఏర్పాటుచేసి ఆన్‌లైన్ ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాంపురం శివారులో ఎ.అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాస్ భారీ భవనం నిర్మించి మత సంస్థ పేరుతో ఆశ్రమం నడుపుతున్నాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పి మహిళలపై వల విసురుతున్నాడు. వారితో వెట్టిచాకిరి చేయించడంతోపాటు ప్రేమదాస్ లైంగికంగా వేధించేవాడు.
అతడి వేధింపులు భరించలేక తెలంగాణలోని కోదాడకి చెందిన ఓ యువతి గురువారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఇష్టం లేకున్నా ఓ యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారని, గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని యువతి ఆరోపించారు. సంస్థ నిర్వాహకుడు నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ నారాయణరావు చెప్పారు. ప్రార్థనల కోసం అనిల్‌కుమార్‌కు రూ.లక్షల్లో చెల్లించామని కడప, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన 30 మందికిపైగా మహిళలు ఇదే సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఎదిరిస్తే చంపుతామని బెదిరించారని ఆరోపించారు.
ఇదీ చదవండి: Man Commits Suicide: తన ఫొటోకు కీర్తిశేషులు అని రాయించి.. తానే పూజలు చేసి..