Lady Harassment: ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వీపు విమానం మోత మోగింది. యువతిని వెంబడించి వెకిలి చేష్టలు చేస్తూ దుశ్చర్యకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. బాధితురాలు కేకలు వేయగా స్థానికులు పట్టుకుని కామాంధునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఇంట్లో వంట పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది బాధిత యువతి.
ఆమె ఇవాళ ఎర్రగడ్డ నుంచి వెళ్తుండగా బోరబండ కార్పొరేటర్ కార్యాలయంలో పనిచేసే ఖలీల్ యువతిని వెంబడించాడు. ఎర్రగడ్డలోని సుల్తాన్‌నగర్ నుంచి రాజీవ్‌నగర్ వరకు వెంబడించిన ఖలీల్ రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యువతిని అటకాయించి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అతని నుంచి కాపాడాలంటూ బాధితురాలు బిగ్గరగా అరవగా స్థానికులు వచ్చి ఆమెను రక్షించి ఖలీల్‌కు దేహశుద్ధి చేశారు. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంబడించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'