సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశానంటూ భావోద్వేగానికి గురిచేస్తాడు. దేశభక్తి చాటుకొనేందుకు ఆకలితో ఉన్నవారికి కడుపునింపితే చాలంటూ మాటలు వల్లె వేస్తాడు. అపార్ట్‌మెంట్లలో ఉండే కుటుంబాల వద్దకెళ్లి అందమైన బ్రోచర్లు చూపుతాడు. ఎంతైనా పర్వాలేదు.. నగదు ఇవ్వమంటూ ఇచ్చినంత తీసుకొని సెల్యూట్ పెట్టి మరీ వెళ్లిపోతాడు. అతడితోపాటు నలుగురైదుగురు అనుచరులు ఉంటారు. నార్సింగి సమీపంలో తన స్వచ్ఛంద సంస్థ ఉందని.. దాదాపు 20 మంది వృద్ధులు, 10 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెబుతూ కొద్దిరోజులుగా సొమ్ము వసూలు చేస్తున్నాడు. షేక్‌పేట్, ఓయూకాలనీ, మణికొండ పరిసర ప్రాంతాల్లో తిరిగాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పదవీ విరమణ చేసిన ఓ అధికారి రూ.50,000 నగదు చెక్ ఇచ్చాడు. మూడ్రోజుల కిందట ఆ సంస్థకు నిత్యావసర సరకులు ఇచ్చేందుకు విశ్రాంత ఉద్యోగి స్వచ్ఛంద సంస్థ చిరునామా వద్దకెళ్లాడు. అప్పటికి కానీ అక్కడ ఏ స్వచ్ఛంద సంస్థ లేదనే విషయం బయట పడలేదు.
ఆకలి తీర్చేందుకు అని చెప్పి..
యూసుఫ్‌గూడకు చెందిన ఓ చిరుద్యోగి వాట్సాప్‌నకు ఓ సందేశం వచ్చింది. నగర శివార్లలో ఉన్న అనాథాశ్రమంలో 40 మంది చిన్నారులున్నారని, కరోనా కష్టకాలంలో వారి ఆకలి తీర్చటం కష్టంగా ఉందని అందులో విషయం. నిజమని భావించిన అతడు నిర్వాహకులు చెప్పిన మొబైల్ నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.5 వేలు పంపాడు. ఈ విషయాన్ని తనకు పరిచయం ఉన్న ఓ అధికారి దృష్టికి తీసుకెళ్తే ఆ పేరుతో స్వచ్ఛంద సంస్థ లేదని చెప్పాడు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు తనకు కాల్ వచ్చిన నంబరుకు ఫోన్ చేసినా ఫలితం లేదు. డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాయం చేయాలనుకొనే వారికి ఎర..
కొందరు ఇలాంటి మాయమాటలతో మానవత్వాన్ని సొమ్ము చేసుకొంటున్నారు. సాయం చేయాలనే ఆలోచన ఉన్న వారిని తేలికగా బుట్టలో వేసుకొంటున్నారు. కరోనా పరిస్థితులు అన్నివర్గాలపై ప్రభావం చూపుతున్నాయి. నకిలీ స్వచ్ఛంద సంస్థల పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో మనసున్న దాతలు ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు దాతృత్వాన్నీ వదలట్లేదు. ఇటువంటి సంఘటనలు సేవా కార్యక్రమాలు చేపట్టే గుర్తింపు ఉన్న సంస్థలు/అనాథాశ్రమాలకు ఇబ్బందిగా మారాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. నిర్వాహకుల మధ్య అంతర్గత విబేధాలు/ఆరోపణలతో దాతల నుంచి నిధులు తగ్గిపోయాయి. కొద్దిరోజులుగా ఈ సంస్థ పేరు చెబుతూ మొబైల్ నంబర్లకు సందేశాలు వస్తున్నాయి. కరోనా కాలంలో తమ వద్ద ఉన్న పిల్లలకు కడుపునిండా తిండిపెట్టలేకపోతున్నామని, సాయం చేయమంటూ కోరుతున్నారు.
బోర్డుతో ఏమార్చి..
గ్రేటర్‌లో ఏదోమూలన అపార్ట్‌మెంట్‌లో కార్యాలయం ప్రారంభిస్తారు. ఆకట్టుకొనేలా కరపత్రాలు రూపొందిస్తారు. 20 నుంచి కులను ఏజెంట్లుగా నియమించుకుంటారు. నిధులు సమీకరించటమే వీరి పని.. వచ్చిన వాటిలో 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తారు. కొన్ని సంస్థలు ఏజెంట్లకు ఏడాదికి ఇంత వసూలు చేయాలనే లక్ష్యం నిర్దేశించారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశీ దాతల నుంచి క్రమం తప్పకుండా నిధులు అందుతుంటాయి. వీటిని లెక్కల్లో చూపుతుంటారు. సొంత ఖర్చులు, విలాసాల కోసం స్థానికంగా నిధులు రాబడుతుంటారు. ప్రస్తుతం నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద ఆశ్రయం పొందుతున్న పిల్లలను సొంతూళ్లకు పంపాయి. అయినా యథేచ్ఛగా పిల్లల కోసమంటూ నిధులు సేకరిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని సంక్షేమశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అవకాశం చేసుకొని ఫోన్ల ద్వారా నిధులు సమీకరిస్తున్న వాటిలో కొన్ని నకిలీ సంస్థలు/వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటువంటి వారి విషయంలో ఒకటికి పదిసార్లు వాస్తవాలు నిర్ధారించుకొని ఆర్థిక సాయం అందించాలని సూచిస్తున్నారు. అనాథపిల్లలు, కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయమంటూ ఫోన్ చేసినా, దత్తత తీసుకోమంటూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నా నమ్మవద్దని జిల్లా సంక్షేమశాఖాధికారి అక్కేశ్వరరావు తెలిపారు. ఇటువంటి ప్రకటనలతో మోసపోవద్దని సూచించారు.
- ఇదీ చదవండి : ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్