వైద్య కళాశాలలో సీట్లు ఇప్పిస్తానంటూ కోటి 23 లక్షల రూపాయలకు టోకరా వేసిన వ్యక్తిపై విజయవాడ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ అజీజ్‌కు పవన్‌కుమార్ అనే వ్యక్తి పరిచమయ్యాడు. అజీజ్ కుమారుడికి భీమిలిలోని ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ వైద్య కళాశాలలో సీటు ఇప్పిస్తానని.. పవన్‌కుమార్ నమ్మబలికాడు. 2013లో రూ.58 లక్షలు గుంజాడు. ఆ ఏడాది సీటు రాకపోవడంతో 2014లో ఖచ్చితంగా వచ్చేస్తుందని మాయమాటలు చెప్పాడు. అప్పుడు కూడా సీటు రాలేదు.
మళ్లీ 2016లో రెండో కుమారునికి ఏలూరు వైద్య కళాశాలలో సీటు ఇప్పిస్తానని రూ.70 లక్షలు తీసుకున్నాడు. కళాశాలలో నగదు సైతం చెల్లించినట్లు రశీదులు తీసుకొచ్చి అజీజ్‌కు చూపించాడు. కళాశాల యాజమాన్యం కొన్ని రోజుల్లో వారిని పిలుస్తారని నమ్మించాడు. ఇంతలో అజీజ్‌కు అనుమానం రావటంతో కాలేజీకి వెళ్లి రశీదులు చూపించగా అవి నకిలీవని తేలింది. పవన్ కుమార్ ఎవరో కూడా తెలీదని కళాశాల యాజమాన్యం చెప్పింది. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితులు.. కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అప్పు చెల్లించమన్నందుకు చంపి పూడ్చేశాడు..