Chepur Accident Today : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 63వ జాతీయ రహదారిపై ఓ కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో నందిపేట్కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన అశోక్, రమేశ్, మోహన్.. కొండగట్టు అంజన్న దర్శనానికి వెళుతున్నారు. తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గంటపాటు శ్రమించి మృతదేహాలను కారులోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజన్న దర్శనానికి బయలుదేరి.. అనంతలోకాలకు చేరడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
ఇవీ చూడండి..