Person Suicide in Hospital: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబ్‌పల్లికి గ్రామానికి చెందిన మర్రి బాపు(46) 2006లో చెల్పూరులో కేటీపీపీ నిర్మాణంలో తన రెండెకరాల భూమిని కోల్పోయారు. అప్పట్లో ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని జెన్‌కో యాజమాన్యం చెప్పడంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేగొండ మండలం పొనగల్లుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా కేటీపీపీ అధికారుల వద్దకు వెళ్లి తన కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని మొర పెట్టుకునేవారు.
విసిగిపోయిన బాపు మార్చి 30, 31 తేదీల్లో కేటీపీపీ వద్దకు వెళ్లి రెండ్రోజులున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఈ నెల 1న కేటీపీపీ గేటు వద్ద పురుగుల మందు తాగారు. సెక్యురిటీ సిబ్బంది వెంటనే భూపాలపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కోలుకున్నారు. తర్వాత రూ.60 వేల బిల్లు చెల్లించాలని ఆసుపత్రి నిర్వాహకులు కేటీపీపీ సిబ్బందిని అడిగారు. స్పందించకపోవడంతో బాపు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు.
బిల్లు చెల్లిస్తేనే డిశ్ఛార్జ్ చేస్తామనడంతో బాపు కుటుంబసభ్యులు డబ్బుల కోసం వెళ్లారు. మూడు రోజులైనా తిరిగి ఎవరూ రాకపోవడంతో కుంగిపోయిన బాపు గురువారం ఉదయం ఆసుపత్రి వార్డులో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు.
"డబ్బులు లేకపోవడంతో నాన్నను దక్కించుకోలేకపోయాం. 2006లో మా భూమిని కేటీపీపీ జెన్‌కో సంస్థ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి మా నాన్న నాకు ఉద్యోగం ఇప్పించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర నిర్వాసితులకు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని నాన్న ఇటీవల ఓ ఉన్నతాధికారిని అడిగితే ఆయన దూషించి బయటకు పంపించారు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. మాది పేద కుటుంబం. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బులు ఎక్కడా దొరకలేదు. ఈలోపే నాన్న ఆత్మహత్య చేసుకున్నారు."
- మర్రి శ్రీకాంత్ కుమారుడు
ఆసుపత్రిలో ఉరి వేసుకుని చనిపోయిన బాబు కుటుంబాన్ని కేటీపీపీ యజమాన్యం ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు సంస్థ ముందు ధర్నా నిర్వహించారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయకుండా ఆత్మహత్యలు చేసుకునే విధంగా యజమాన్యం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఒకరికి ఉద్యోగం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రూ.300 కోసం మర్డర్... శ్మశానవాటికలోకి తీసుకెళ్లి మరీ...
కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. అడ్డంగా బుక్కైన నిందితులు.. సీఎం ప్రశంసలు