సర్పంచ్ ఇంట్లో పనికి వెళ్లకపోవడంతో కక్ష కట్టిన సర్పంచ్ ఆ మహిళ ఇంటిని కూల్చి వేయించి.. అడ్డు వచ్చిన గ్రామస్థులపై దాడి చేయించాడని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కళమ్మ.. తన మేనమామ భిక్షం అనారోగ్యంతో మంచాన పడటంతో అతనికి సపర్యలు చేయసాగింది. ఇష్టం లేని భర్త.. ఆమెను వదిలేశాడు. కొంత కాలానికి భిక్షం మరణించాడు. గ్రామస్థులంతా కలిసి 170 గజాల స్థలంలో ఉన్న భిక్షం ఇంటిని కళమ్మ పేరు మీద రాసి తీర్మానం చేశారు.
సర్పంచ్ సహకారంతో
దీంతో కళమ్మ చిన్న మేనమామ, అతని బంధువులు, కుమార్తెలు అందరూ కలిసి సర్పంచ్ సహకారంతో కళమ్మ ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చేసి సామగ్రిని బయట పడేశారు. అడ్డుకోబోయిన గ్రామస్థులపై దాడి చేశారు. ఊరంతా ఆమె వైపే ఉండగా, కుటుంబ సభ్యులు ఇలా దాడి చేయడం విచారకరమని స్థానికులు వెల్లడించారు.
తన ఇంట్లో పని చేయడానికి రావడం లేదని కోపంతో ఉన్న సర్పంచ్.. కళమ్మ చిన్నమామ కుటుంబీకులకు మద్దతునిచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డారు. దాడిలో కళమ్మ ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు.. ఘర్షణకు కారణమైన సర్పంచ్ సాయిలు, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రహదారిపై కారు బోల్తా.. అన్నదమ్ముల మృతి