ఎవరికైనా(Couple cheated unemployed in hanmakonda) ఉద్యోగం ఇవ్వాలంటే వారి ప్రతిభ చూస్తారు కానీ.. డబ్బులు కట్టించుకుని ఉద్యోగం ఇవ్వాలని ఏ సంస్థా భావించదు. ఈ చిన్న లాజిక్‌ను ఎలా మరిచిపోతారో ఏమో.. డబ్బులిచ్చి ఉద్యోగం కొనుక్కోవచ్చనుకుంటారు కొందరు అమాయకులు. అలాంటి నిరుద్యోగుల ఆవేదనను ఆసరాగా చేసుకుని వారికి ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తరచూ ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. పోలీసులు ఇలాంటి ఘటనలపై ఎంత అప్రమత్తం చేస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మోసగాళ్లు చెప్పే మాయమాటలకు సులభంగా వారి వలలో పడుతున్నారు. ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను.. ఓ కిలాడి దంపతులు ఆశపెట్టిన సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి.. తరువాత వారికి కుచ్చుటోపీ పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. మోసాలకు పాల్పడుతున్న దంపతులను వరంగల్ టాస్క్‌ఫోర్స్(warangal taskforce) పోలీసులు పట్టుకున్నారు.
ఆ విధంగా మాస్టర్ ప్లాన్
హనుమకొండ శాయంపేటకు చెందిన వినయ్‌పాల్‌రెడ్డి.. ములుగు జిల్లాలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే రెవెన్యూ విభాగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న అనసూయను పెళ్లి చేసుకున్నాడు. అడ్డదారుల్లో సంపాదించాలనే దుర్భుద్దితో.. నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్లు తయారు చేసి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు. అవినీతి ఆరోపణలపై 2012లో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ తరువాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ ఐడీ(cheating by jobs in telangana) కార్డులు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దంపతులు డబ్బులు వసూలు చేశారు.
కింగ్ పిన్ అనే వ్యక్తి.. ఇందులో ముఖ్య వ్యక్తి. దిల్లీలో ప్రధాన కార్యాలయం పెట్టి వీరి సహాయంతో నిరుద్యోగులను మోసం చేశారు. కొన్ని ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసి కొందరికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత నకిలీ ఉత్తర్వులిచ్చారు. వారు నిజమేనని నమ్మి పాఠశాలలకు వెళ్తే అక్కడి యాజమాన్యం తిరస్కరించింది. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పట్టుకున్నాం. -తరుణ్ జోషి, వరంగల్ సీపీ
ఎకరం భూమిని అమ్మి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్‌లో రూ. 6లక్షలు కట్టాను. హైదరాబాద్‌లో 15 రోజులు శిక్షణ ఇచ్చారు. తర్వాత ఉద్యోగం అడిగితే ఈ రోజు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. దాంతో మోసపోయానని అర్థమైంది. -రాహుల్, బాధితుడు, ములుగు
శిక్షణ కూడా ఇచ్చి
వినయ్‌పాల్‌రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి(couple cheated unemployed in telangana), అనసూయ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా.. సాకేత్ అనే వ్యక్తి సహాయ కమిషనర్లుగా అవతారమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిరుద్యోగుల నుంచి రూ. 5 నుంచి 10 లక్షలు వసూలు చేశారు. 241 మంది నిరుద్యోగులకు వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15 రోజుల శిక్షణ కూడా ఇచ్చారు. వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులిచ్చి బురిడీ కొట్టించారు. ఉద్యోగాలు వచ్చాయనే ఆనందంతో పాఠశాలలకు వెళ్లిన నిరుద్యోగులకు అవి నకిలీవని తేలడంతో కంగుతిన్నారు. దారుణంగా మోసం పోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో....ఈ ముఠా గుట్టు బయటపడింది. నిరుద్యోగుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఉద్యోగాలిస్తామంటూ నకిలీ సంస్థలు చేసే ప్రకటనలపై.. అప్రమత్తంగా ఉండాలని నిరుద్యోగులకు సీపీ సూచించారు.
మా నాన్న చనిపోవడంతో మాకు పరిహారం కింద వచ్చిన డబ్బును ఈ ఆర్గనైజేషన్‌లో కట్టాను. నాకు ఇష్టం లేకపోయినా బంధువుల ఒత్తిడితో ఇందులో చేరాను. ఆ డబ్బులు సరిపోకపోతే పొలం కూడా అమ్మాను. వారం రోజులు శిక్షణ ఇచ్చారు. కరోనా కారణం చెప్పి ఎక్కువ రోజులు శిక్షణ ఇవ్వలేదు. ఇప్పుడు ఉద్యోగం అడిగితే ముఖం చాటేశారు. -సుమంత్, జనగామ, బాధితుడు
బాధితులు కన్నీటి పర్యంతం
వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను(couple cheated unemployed news) మోసం చేసి ఈ దంపతులు వసూళ్లకు పాల్పడ్డారు. వరంగల్ పరిధిలోనే 40 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 21 లక్షల 70 వేల నగదు, రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని తలచుకుని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో కాంట్రాక్టుల పేరుతో గాలం.. జేసీబీ, ట్రాక్టర్ల ఓనర్లే బాధితులు