చిన్నారి చెల్లిని కాపాడేందుకు ఓ అక్క పడుతున్న తాపత్రయమిది.. కానీ ఆ సోదరి ప్రయత్నం విఫలమైంది. చెల్లి మృతి చెందింది. హృదయ విదారకమైన ఈ ఘటన శనివారం సాయంత్రం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. అక్కాచెల్లెళ్లు ఊయల ఊగుతూ సంతోషంగా గెంతుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అక్క కన్నా బాగా ఊగాలనే తాపత్రయంలో చెల్లెలు గబగబా ఊయల ఎక్కుతుండగా పట్టుతప్పింది. ఆసరాగా వేసుకున్న కుర్చీ కిందపడటంతో ఊయలే ఉరితాడై మెడకు బిగుసుకుంది. అక్క గట్టిగా అరుస్తూ కాపాడటానికి ప్రయత్నించింది. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు వచ్చేసరికి చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లోని దక్కింసేతం గ్రామానికి చెందిన భార్యాభర్తలు భక్త బిస్వాస్, పాణేశ్వరిలు బతుకుతెరువు కోసం కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వచ్చారు. అంకుసాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా ఆసుపత్రి భవనం వద్ద రాడ్‌బైండర్‌గా కూలి పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పాపలు, ఒక కుమారుడు. పక్కనే గుడారాలు వేసుకొని నివాసముంటున్నారు. సాయంత్రం వీరి కూతుళ్లు పాకి బిస్వాస్(8), వర్ష బిస్వాస్‌లు ఊయల ఊగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్క వర్ష బిస్వాస్ ఎదుటే చెల్లెలు పాకిబిస్వాస్(8) ఉక్కిరిబిక్కిరై మృతి చెందింది. అప్పటి వరకు సంతోషంగా ఆడుకున్న కూతురు క్షణాల వ్యవధిలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.