హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధి కార్మికనగర్‌లో వెలుగు చూసిన హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి ఇంట్లో అపహరించిన సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు మహ్మద్ అలీని మెహదీపట్నంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు భావిస్తున్న మృతుడి భార్య రూబీనాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చిన నిందితుడు కార్మికనగర్ కూడలి వరకు వెళ్లినట్లుగా అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
సీసీ కెమెరాల్లో దృశ్యాలు :
టైలర్‌గా పనిచేసే సిద్దిఖ్ అహ్మద్ శ్రీరాంనగర్‌లోని బావమరిది ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై అర్ధరాత్రి ఇంటికి రాగా.. అతని వెనకాలే గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. అతను తిరిగి గత నెల 31న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో హతుని ఇంట్లో నుంచి బయటకు వస్తూ.. ఆ సమయంలో ఓ సంచిని తీసుకువెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను, రక్తపు మరకల్ని తుడిచిన దుస్తులను సంచిలో పెట్టుకుని ఉంటాడని పోలీసులు గుర్తించారు. నిందితుడికి, హతుడి భార్యకు మధ్య ఫోన్ కాల్స్ జరిగినట్లు వెల్లడించారు. తన వదిన తరఫు వారే హత్య చేసి ఉంటారని మృతుడి సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.