దేశమెంత అభివృద్ధి చెందినా... సర్కారెన్ని కొత్త జీవోలు తెచ్చినా... కోర్డులెంత కఠినంగా శిక్షిస్తున్నా... కర్కశుల బుద్ధిమాత్రం మారడం లేదు. ఇవేమీ పాశవిక హృదయాలను కదిలించడం లేదు. రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాలు.. మెట్రో పాలిటన్ సిటీల్లోనే మనం తరచూ వినే అత్యాచారాలు.. ఇప్పుడు పచ్చని పల్లెలకూ వ్యాపించాయి. అభం శుభం తెలియని గిరిజన గ్రామాల్లోనూ ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి.
అశ్వారావుపేట మండలంలో ఓ మహిళ రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళుతోంది. జగన్నాథపురం సమీపానికి రాగానే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఆమె దగ్గర ఆపి మాట్లాడేందుకు యత్నించారు. ఏం జరుగుతుందో అర్థంకాని ఆ మహిళ ఒక్కసారిగా భయానికి గురైంది. ఇంతలోనే.. ఇద్దరూ బైక్ దిగి కండువాతో ఆమె నోట్లో కుక్కారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లారు. కర్కశంగా రాక్షసానందం పొందారు.
జనవరి 23 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వెంటనే... గిరిజన మహిళ లబోదిబోమంటూ విలపించింది. తనకు జరిగిన అన్యాయాన్ని కన్నీటితో గ్రామస్తులకు వివరించింది. నారాయణపురానికి చెందిన జగదీశ్, కృష్ణ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది. ఏం జరిగిందో.. తెలియదు కానీ.. విషయం బయటికి రాలేదు. గురువారం రాత్రి మహిళ అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. యువకులకు గ్రామపెద్దల అండదండలు ఉన్నాయని, అందుకే ఇంతకాలం జాప్యం జరిగిందని బాధితురాలు వాపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బాలికపై అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు