Case on GST Officials: మహిళను అక్రమంగా నిర్బంధించారనే ఫిర్యాదు మేరకు ఐదుగురు జీఎస్టీ అధికారులపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 ఫిభ్రవరి 27వ తేదీన శ్రీధర్ రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భరణీ కమోడిటీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానంతో అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన సమయంలో శ్రీధర్ రెడ్డి ఇంట్లో లేరని అతని భార్య రాఘవి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అదే రోజు బషీర్‌బాగ్ లోని జీఎస్టీ కార్యాలయానికి తీసుకెళ్లి రాత్రి మొత్తం అక్కడే ఉంచారని, రూ. 5 కోట్లు ఇస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని బెదిరించినట్లు రాఘవి రెడ్డి తెలిపారు.
తనిఖీలకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండానే ఇంటికి వచ్చి, తనను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తీసుకెళ్లారని బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. భరణి కమోడిటీస్ నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డిని జీఎస్టీ అధికారులు అప్పట్లోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐకి ఫిర్యాదు చేసినా ఆ మేరకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో అధికారులపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఇవీ చదవండి:హైదరాబాద్లో మరోసారి గ్రీన్ఛానెల్.. 27 నిమిషాల్లోనే..