Bikers Arrest: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ద్విచక్రవాహనాలు నడుపుతున్న 9 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రహదారులపై మంగళవారం(మార్చి1న) రాత్రిపూట.. స్పోర్ట్స్ బైకులతో ప్రమాదకరంగా విన్యాసాలు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు కాస్తా.. బేగంపేట పోలీసులకు చేరటంతో ఆ ప్రాంతపు సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీకెమెరాల దృశ్యాల ఆధారంగా సదరు యువకులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి 45 ద్విచక్రవాహనాలతో పాటు నాలుగు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు..
రాత్రివేళల్లో.. రోడ్లపై ప్రమాదకరంగా ద్విచక్రవాహనాలు నడుపుతూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్టు సీసీకెమెరాల్లో గుర్తించామని ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చరవాణుల్లో రికార్టు చేసి.. సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారన్నారు. తద్వారా.. సోషల్ మీడియాలో పాపులారిటీతో పాటు డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారని వివరించారు. వాళ్లు సర్కర్ ఫీట్లు చేస్తూ.. ఇతర వాహనదారులను ప్రమాదాల్లోకి నెడుతున్నారన్నారు. ప్రజలకు ఇబ్బంది కల్గించే ఇలాంటి వాళ్లను.. ఉపేక్షించేది లేదని డీసీపీ హెచ్చరించారు.
విలువైన జీవితాలు పాడు చేసుకోవద్దు..
"సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం.. యువకులు అత్యంత విలువైన తమ జీవితాలను రిస్క్ చేస్తున్నారు. బైకులను అతివేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. వాళ్ల జీవితాలను రిస్కులో పెట్టడటమే కాకుండా.. ఇతర వాహనదారులు ప్రమాదాల్లో చిక్కుకునేలా చేస్తున్నారు. వీళ్లు చేసే విన్యాసాలు గుర్తించి.. సీసీ కెమెరాల ద్వారా తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నాం. ప్రజలకు ఇబ్బంది కల్గించే ఇలాంటి పనులను అస్సలు ఉపేక్షించేది లేదు. యువకులు తమ విలువైన జీవితాలను ఇలాంటి వాటి కోసం పాడు చేసుకోవటం సరైంది కాదు." - చందన దీప్తి, ఉత్తర మండల డీసీపీ
ఇదీ చూడండి: