నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పార్పల్లి తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని బానావత్ రాజేశ్ అనే బాలుడు మృతి చెందాడు.
రాజేశ్ పార్పల్లి తండా నుంచి పార్పల్లి గ్రామం వైపు సైకిల్‌పై వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబసభ్యులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.