Heroin Seized: డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమ మార్గాలు. అందులో ఒకటి డ్రగ్స్ రవాణా. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి దేశాలు దాటిస్తూనే ఉన్నారు. బ్యాగులు, ప్యాకెట్లు ఇలా ఒకటేమిటి.. నానా మార్గాల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు. అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు మత్తు అక్రమ రవాణాలో.. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో రూ. కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలా అయితే దొరికిపోతాం అనుకున్నారేమో.. మరో పద్ధతిని అవలంభిస్తున్నారు. అదే క్యాప్సూల్స్ రూపంలో.
'వీడొక్కడే' సినిమాలో డ్రగ్స్ సరఫరా చేయడం కోసం విలన్.. కొందరితో క్యాప్సూల్స్ మింగించి.. అవి అరగకుండా కడుపులో భద్రపరిచి దేశం దాటిస్తాడు. వాటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటాడు. అలాంటి సన్నివేశమే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గత నెల 26న జోహనెస్‌బర్గ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టాంజానియా ప్రయాణికుడిని అనుమానంతో కస్టమ్స్ ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. నిందితుడు హెరాయిన్ క్యాప్సూల్స్ మింగినట్లు గుర్తించారు.
దీంతో అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ప్రయాణికుడి నుంచి హెరాయిన్ క్యాప్సూల్స్‌ను కడుపులో నుంచి బయటకు తీశారు. వెలికితీసిన మొత్తాన్ని లెక్కేశాక అధికారులు, వైద్యులు అవాక్కయ్యారు. ఎందుకంటే అతను మింగింది ఏ పదో.. ఇరవయ్యో కాదు.. ఏకంగా 109. వాటి విలువ తేల్చాక విస్తుపోయారు. మొత్తం 109 క్యాప్సూల్స్‌లో హెరాయిన్ బరువు 1,389 గ్రాములు ఉండగా.. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 11.53 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధరించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: ఐరన్ పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
Baby Boy Kidnap : తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న పసికందు కిడ్నాప్
కొకైన్.. పరేషాన్!.. హైదరాబాద్‌పై మత్తుమందుల ముఠాల కన్ను
ఐసీసీ ర్యాంకింగ్స్.. టీ20ల్లో మనమే టాప్.. టెస్టులు, వన్డేల్లో ఇలా..