చారిత్రక ఓరుగల్లు నగరం సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. సాయంకాల వేళ నగరవాసులకు ఆహ్లాదం పంచే విధంగా ఫాతిమానగర్ కూడలిలో వావ్ వరంగల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతుల ధగధగలు నగరవాసులకు ఆహ్లాదాన్నిస్తోంది. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం అందాల మధ్య ఓరుగల్లువాసులు సేదతీరుతున్నారు. సరదాగా సెల్ఫీ తీసుకుంటూ సందడి చేస్తున్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద కాజీపేట వంతెన నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఏర్పాటుచేసిన పబ్లిక్ స్పేస్ లైటింగ్ నగరానికి కొత్త శోభను చేకూర్చింది.
త్రినగరి ప్రధాన రహదారికి 10 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు తళుకులీనుతున్నాయి. ఓరుగల్లు ప్రత్యేకత, చరిత్రను తెలియజెప్పేలా ప్రధానకూడళ్లలో చిత్రలేఖనాలు ఎంతో ఆకర్షణగా మారాయి. కాకతీయ రాజుల వైభవం, గ్రామీణతకు అద్దం పట్టే బొమ్మలు, పరిశుభ్రత ప్రాధాన్యతని తెలిపే పెయింటింగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ వెలుగుల మధ్య నీటి ఫౌంటెయిన్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.