Mirchi and Cotton Record Rate: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతులు పండించిన మిర్చి, పత్తి రికార్డు ధరలను నమోదు చేస్తున్నాయి. నిన్నటి వరకు బంగారం ధరతో పోటీ పడిన ఎర్ర బంగారం తాజాగా పసిడి ధరను దాటింది. నేనేమి తీసిపోనంటూ తెల్ల బంగారం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది.
ఎనుమాముల మార్కెట్లో దేశీయ రకం మిర్చి ఏకంగా 55వేల 551 రూపాయలు నమోదు చేయగా.. క్వింటాల్ పత్తి 12వేల 110 రూపాయలు పలికింది. ములుగు జిల్లాకు చెందిన రైతు రాజేశ్వరరావు తెచ్చిన మిర్చికి గత వారం అత్యధికంగా 52 వేల ధర పలకగా... ప్రస్తుతం అంతకు మించి పలికింది.
అంతర్జాతీయంగా పత్తి, మిరపకు డిమాండ్ పెరగడంతో పాటు... దిగుబడులు సగానికి పడిపోవడం వల్ల క్రమంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా పత్తి గింజలతో పాటు దారం ధర పెరగడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆ ధరలు పలకడం మార్కెట్ చరిత్రలోనే తొలిసారి అని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. పత్తి, మిర్చికి అధిక ధర నమోదు కావడంపై పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రైతుల ఆగ్రహాన్ని దిల్లీ పాలకులకు చూపిస్తాం..: 'రైతు దీక్షలో' తెరాస నేతలు