భాజపా పాలనలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్ విమర్శించారు. మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని.. బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఉత్తరప్రదేశ్ హాథ్రస్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్షను చేపట్టాయి.
ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా అత్యాచార నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలన్నారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.