pocso court started in mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి అనిల్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
'ఈరోజు చాలా చారిత్రాత్మక రోజు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా మన ట్రైబల్ రీజియన్ మహబూబాబాద్‌లో చాలా గొప్పగా పోక్సో కోర్టును ప్రారంభించుకున్నాం. ఎన్నో ప్రత్యేక వసతులతో కోర్టు నిర్మాణం ఉంది. బాధితులు, నేరస్థులు ఒకరికొకరు కనపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. చైల్డ్ ఫ్రెండ్లీ కల్చర్‌లో వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే అవకాశం ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. బాధితులకు ప్రత్యేక గదితో పాటు నడవడానికి బాట ఏర్పాటు చేశాం. కోర్టు ప్రాంగణంలోని గోడలకు ఇరువైపులా ప్రత్యేక ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా బొమ్మలను చిత్రీకరించాం. వీటన్నింటిని చూస్తే వేరే వాళ్ల ఇంటికి వెళ్తున్నామనే భావన కలుగుతుంది. కోర్టుకు వెళ్తున్నామనే భావన రాదు.'
అనిల్ కిరణ్ కుమార్, జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి
దేశంలోనే మొదటిసారి కావచ్చు..
గిరిజనులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మహిళలపై ఎక్కువగా హింస కేసులు నమోదు అవుతున్నాయని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి అనిల్ కిరణ్ కుమార్ అన్నారు. సుమారు 110కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని... ట్రైబల్ రీజియన్లో ఇలాంటి కోర్టులను ఏర్పాటు చేయడంలో జస్టిస్ నవీన్‌రావు చాలా కృషి చేశారని తెలిపారు. బహుశా దేశంలోనే గిరిజన ప్రాంతంలో ఇలాంటి కోర్టులను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:POCSO Courts in Telangana : గిరిజన జిల్లాలో తొలి పోక్సో కోర్టు