అమ్మ... వంటింట్లో గరిట పట్టి పిల్లలకు కమ్మగా వండిపెడుతుంది. తన పిల్లలకు ఏదైనా ఆపద వస్తే కత్తిపెట్టి కదనానికి దిగుతుంది. కరోనా వంటి ఆపత్కాల సమయంలో తన పిల్లలను మహమ్మారి బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుతోంది. తన ప్రాణాలు అడ్డుపెట్టి మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అమ్మలకు ఈటీవీ భారత్ తరఫున మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
రక్షిస్తున్నారు..
నర్సుల నుంచి మహిళా వైద్యుల వరకు ఎంతో మంది ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. కొవిడ్ ఐసోలేషన్ వార్డుల్లోకి వెళ్లి అనుమానితులను పరీక్షిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశ కార్యకర్తలు, 108 సిబ్బంది వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అడ్డుకుంటున్నారు
కరోనా వ్యాప్తి చెందుతున్న మొదట్లోనే మాస్కుల కొరత తీవ్రంగా ఉండడంతో వరంగల్‌లోని వేలాది స్వయం సహాయక సంఘాల మహిళలు మాస్కులు కుట్టడం ప్రారంభించారు. ఒక్కో జిల్లాలో కనీసం లక్ష వరకు కుట్టి వివిధ శాఖలకు తక్కువ ధరకే అందిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పీపీఈ కిట్లను రూపొందిస్తున్నారు. ములుగులో ఈ కార్యక్రమం మొదలుపెట్టి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పరిశుభ్రంగా ఉంచుతూ..
పిల్లలు హాయిగా ఉండడానికి తల్లులు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతారు. కరోనా సమయాన పారిశుద్ధ్య కార్మికులు ఊరంతా శుభ్రంగా ఉంచుతున్నారు. తమ ఆరోగ్యాన్నీ పణంగా పెట్టి ప్రజలకు అమ్మల్లా సేవలందిస్తున్నారు.
భద్రతనిస్తున్నారు..
లాక్‌డౌన్ వేళ అధికారిణులు, మహిళా కానిస్టేబుళ్లు ఎంతో మంది ఎండనకా, వాననకా చెక్‌పోస్టుల వద్ద పురుషులతోపాటు విధులు నిర్వర్తిస్తూ భద్రత ఇస్తున్నారు.
సేవలోనూ..
లాక్‌డౌన్ వేళ వలస కార్మికులు, ఇతర అనాథలకు పలువురు అన్నం పెడుతున్నారు. అన్నీ తామై కడుపు నింపుతున్నారు.
పాలన...
వైరస్ వేళ ఎంతో మంది అమ్మలు ధైర్యంగా దూసుకెళ్తున్నారు. కలెక్టర్లు, కమిషనర్ల నుంచి మొదలుపెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచుల వరకు వందలాది మంది స్ఫూర్తిదాయక పాలన కొనసాగిస్తున్నారు. కరోనాను నివారించేందుకు ఊరూరా తిరుగుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు
- మంత్రులు : 1
- ఐఏఎస్ : 3
- ఎమ్మెల్యే, ఎంపీ : 2
- ప్రజాప్రతినిధులు 1500
- వైద్యులు 84
- పోలీసులు 322
- ఏఎన్‌ఎంలు 1180
- స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు : 150
- ఆశ కార్యకర్తలు 3692