MOTHER COMPLAINED ON SON: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మచ్చిక కొమురమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు.. తన కొడుకు, కోడలు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి వేదనను తట్టుకోలేకపోయిన ఆ తల్లి న్యాయవాది శ్యామ్ప్రసాద్తో కలిసి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసింది.
కుమారుడు వంశీకృష్ణ పంచాయతీ కార్యదర్శిగా, కోడలు జయశ్రీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తన గోడును కలెక్టర్కు వివరించింది. ఆమె మాటలు విని చలించిపోయిన కలెక్టర్.. సీనియర్ సిటిజన్ చట్టం-2007 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
'కొట్టి ఇంట్లో నుంచి వెల్లగొట్టినా ఒక్కరోజూ ఫోన్ చేసి మాట్లాడుతలేడు. చుట్టాలకు ఫోన్ చేసి అమ్మ ఇంట్లో నుంచి పోయాక సంతోషంగా ఉంటున్నామని బంధువులకు చెప్తున్నాడు. అది విన్న నాకు దుఃఖం ఆగట్లేదు. ఏడాదిన్నర నుంచి బిడ్డల దగ్గరే తల దాచుకుంటున్నాను. ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిస్తే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుమారుడు బాగా చూసుకుంటాడనుకున్నాను. కానీ రోజూ చిత్ర హింసలకు గురి చేస్తూ కొడుకు, కోడలు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక రోజు వారిద్దరు కలిసి కొడితే రాత్రి మొత్తం బాత్రూంలోనే ఉండి నల్ల నీళ్లు తాగి తెల్లవారే దాకా అందులోనే ఉన్నాను.'
-మచ్చిక కొమురమ్మ
కుమారుడు, కోడలుపై చర్యలు తీసుకొని.. తనకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంది. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనుతిరిగి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి:అమానవీయం.. కుమార్తెపై మూడేళ్లుగా అత్యాచారం