వరంగల్ పట్టాణాభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్ట్యా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ బృహత్ ప్రణాళికను తయారు చేస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై మంత్రులు ఎర్రబెల్లి, ఈటలతో కలిసి కుడా పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో హైదరాబాద్లో సమీక్షించారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుదిదశకు చేరుకొందని కేటీఆర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ గురించి ప్రజాప్రతినిధులకు స్వయంగా మంత్రి వివరించారు.
2041నాటికి అవసరాలకు అనుగుణంగా..
వరంగల్ బృహత్ ప్రణాళిక ముసాయిదాపై.. ఇప్పటి వరకు వచ్చిన 4వేలకు పైగా సలహాలు, సూచనలతో పాటు వివిధ వర్గాలతో చర్చించాకే సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. 2041 వరకు నగర అవసరాలు, నగరానికి ఉన్న చారిత్రక ప్రత్యేకత, పురావస్తు, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ... చెరువులు, రహదార్లు, కాలనీలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రహదార్లపై ప్రత్యేక శ్రద్ధ
రేడియల్ రోడ్లను అవుటర్ రింగ్ రోడ్డుకు కలుపుతూ రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రోత్ కారిడార్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు వంటి అంశాలను వివరించిన ఆయన... అందుకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పనితీరును మార్చుకోవాలని చెప్పారు. వరంగల్ నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూహక్కుల బదిలీ విధానం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం తర్వాత జీఐఎస్తో అనుసంధించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
నగరంలో చెరువులను, రోడ్లను కచ్చితంగా గుర్తించాలన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానించేందుకు అవసరమైన రవాణా మార్గాలను చేర్చాలని సూచించారు. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో అన్ని వర్గాల ప్రతిపాదనలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని చెప్పారు. వచ్చే నెల 5న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనపై చర్చించిన దయాకర్ రావు... ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే ప్రాజెక్టులను వివరించారు.
ఇదీ చూడండి :హుజూర్నగర్లో వేడెక్కిన రాజకీయం...