వరంగల్ మహా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మేయర్ గుండా ప్రకాశ్ మరోసారి స్పష్టం చేశారు. హన్మకొండలోని అంబేడ్కర్భవన్లో వరంగల్ నగర పాలక సర్వ సభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. నగరంలో త్వరలో చేయబోయే పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా పలువురు కార్పొరేటర్లు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం నిధులు ఇస్తున్నా... కాలనీల్లో ఉన్న సమస్యలను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిష్కరించడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. చిన్న వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. మరో కొన్ని నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని పలు డివిజన్లలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తేనే మళ్ళీ తాము ఓట్లు అడిగే పరిస్థితి ఉందని గోడు వెల్లబోసుకున్నారు.
నగరంలో చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టామని మేయర్ తెలిపారు. వరంగల్ నగరానికి ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుందని... వాటిని సంక్రమంగా ఉపయోగించుకొని సమన్వయంతో అభివృద్ధి చేసుకుందామని సూచించారు.