ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నింటినీ వరంగల్ నగరపాలికకు విడుదల చేశామని... మళ్లింపు ఏమాత్రం జరగలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు కింద కేంద్రం విడుదల చేసిన 196 కోట్లా 40 లక్షల రూపాయలు వరంగల్ నగరపాలికకు జమ అయ్యాయని చెప్పారు. మొత్తం 1029 కోట్ల రూపాయల వ్యయంతో 63 పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 46.67 కోట్ల విలువైన పనులు జరగ్గా... 40.67 కోట్ల చెల్లింపులు పూర్తైనట్లు వివరించారు.
వరంగల్ కార్పొరేషన్లో నిధులు సరిపడా ఉన్నాయని అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. భూసేకరణ, డీపీఆర్ తయారీ తదితరాల వల్ల మొదట్లో పనులు కొంత ఆలస్యమైనా... రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వేగవంతం అయ్యాయన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులకు అదనంగా ముఖ్యమంత్రి హామీల కింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.72.87 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదలయ్యాయని ముఖ్యకార్యదర్శి తెలిపారు.