రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ధరిణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. దీనికంటే ముందు గ్రామాలు, పట్టణాల్లో ఆస్తుల వివరాలన్నీ అంతర్జాలంలో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశానుసారం నగరపాలిక, పురపాలికల్లో ఆస్తుల సర్వే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందుకోసం వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తుల సర్వే ఇంటింటా చేపడుతున్నారు.
ఆస్తిపన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) డేటా ప్రకారం సర్వే చేపడుతున్నారు. వరంగల్ నగరంలోని 58 డివిజన్లలో 1.83 లక్షల పైచిలుకు వరకు ఆస్తి పన్ను అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఈ వివరాలన్నీ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించేందుకు పన్నుల విభాగానికి చెందిన అధికారులు, ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు, కారోబార్లు బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్తున్నారు. 51 అంశాల ప్రొఫార్మాలో వివరాలు నింపుతున్నారు. కొన్ని రెవెన్యూ వార్డుల్లో పైలెట్ ప్రాజెక్టు ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
రెవెన్యూ వార్డు, బ్లాకు, ఇంటినంబరు, ప్రాంతం, ఇంటి యజమాని పేరు తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తిపన్ను డేటా ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్నాయా?, లేదా అనేది పరిశీలిస్తున్నారు. సేకరించిన వివరాలు వెంట వెంటనే కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. నగరంలోని అన్ని రెవెన్యూ వార్డులో ఇంటింటా సర్వే నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దించాలని చూస్తున్నారు.
కరీమాబాద్‌లో వివరాలు సేకరిస్తున్న పన్నుల అధికారి, ఆర్‌ఐ
ఏడు వేల ఖాళీ స్థలాలు
వరంగల్ నగరంలో సుమారు ఏడువేల పైచిలుకు వరకు వెకెట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్‌టీ) అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటన్నంటికి ఇంటినంబర్లు కేటాయిస్తున్నారు. దాదాపుగా 70-80 శాతం వరకు ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి పొందినవే ఉన్నాయి. వీఎల్‌టీల వివరాలు సైతం ధరిణి పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆస్తిపన్ను అసెస్‌మెంట్ల సర్వే పూర్తైన తర్వాత వీఎల్‌టీల వివరాలు సేకరిస్తారు. విలీన గ్రామాల్లో వ్యవసాయం, వ్యవసాయేతర స్థలాలు రెండుగా విభజిస్తారని తెలిసింది. ఆస్తుల వివరాలన్నీ ధరిణి పోర్టల్ నమోదు చేసేలా ప్రతిపాదించారు.