గ్రేటర్ వరంగల్ ఎన్నికల క్రతువు చివరి అంకానికి చేరుకుంది. చారిత్రక నగరిగా ఖ్యాతి పొందిన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజేతలెవరన్నదీ... తేలిపోయే సమయం వచ్చేసింది. నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూలులో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. డివిజన్లను మొత్తం 3 బ్లాకులుగా చేసి... లెక్కింపు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియలో మొత్తం 2 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతి డివిజన్‌కు 2 బల్లలు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్లో బల్లకు వేయి ఓట్ల చెప్పున లెక్కిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టిన తరువాత బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లను లెక్కిస్తారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 54.74 పోలింగ్ శాతం మాత్రమే నమోదు కావడం వల్ల.. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు, పోలీసులందరికీ కొవిడ్ పరీక్షలు చేసి నెగెటివ్ వచ్చినవారినే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. లెక్కింపు జరిగే కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. 66 డివిజన్లలకు ఏకకాలంలో లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు.
కొవిడ్ కేసుల పెరుగుదల... రాత్రి పూట కర్ఫ్యూ... భానుడి భగభగల మధ్య జరిగిన తొలి ఎన్నికలివే. ఇక ఎన్నికల్లో తెరాస, భాజపా... 66 స్థానాల్లో అభ్యర్థులను నిలుపగా... కాంగ్రెస్ 64 డివిజన్లలో మాత్రమే అభ్యర్థులను బరిలో నిలిపింది. వామపక్షాలు 16, తెలుగుదేశం 13, ఇతరులు 39 డివిజన్లలో పోటీ చేస్తుంటే... స్వతంత్రులు 36 డివిజన్లలో పోటీ చేశారు. పోలింగ్ ముగిసినప్పట్నుంచి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ... తమకెన్ని స్థానాలు వస్తాయన్న లెక్కల్లో మునిగిపోయాయి. లెక్కలు, అంచనాలు కొందరిలో మోదం నింపగా... మరికొందరిలో ఖేదం నింపుతున్నా... ఫలితాల కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అభివృద్ధే ప్రధాన ఎజెండాగా తెరాస ప్రజల ముందుకెళితే భాజపా కూడా నగరం అభివృద్ధి... కేంద్రం వల్లే సాధ్యమైందంటూ ప్రచారం నిర్వహించింది. ఇక అధికారపక్షమైన తెరాస... మరోసారి మేయర్ పీఠం తమదేనని మొదటి నుంచి ధీమాగానే ఉంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే కంటే రెండు రోజులు ముందే వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు... ముమ్మరంగా డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏడెనిమిది డివిజన్లు చుట్టేశారు. సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తెరాస హయాంలో నగరానికి జరిగిన అభివృద్ధి, చేయాల్సిన పనులను వివరిస్తూ... గులాబీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. 66 డివిజన్లలో 50కి పైగా డివిజన్లు వస్తాయని... గట్టి పోటీ నెలకొన్న మరో 16 చోట్ల కూడా తమ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని... మేయర్, ఉప మేయర్ పీఠాలు తమవేనని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు.
మేయర్ పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకున్న కమలం నేతలు... గ్రేటర్ వరంగల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముమ్మర ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేంద్రం ద్వారా వచ్చే నిధుల ద్వారానే నగరం అభివృద్ధి చెందిందని... ఓటర్ల ముందుకొచ్చారు. బైక్ ర్యాలీలు నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 2016లో ఒకే ఒక కార్పొరేటర్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు స్థానాలు పెరుగుతాయని.. అనుకున్నా వాటికన్నా ఎక్కువే వస్తాయని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత వి.హనుమంతరావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డి... ప్రచారం నిర్వహించారు. గతంలో నాలుగు డివిజన్లు హస్తానికి దక్కగా... ఈసారి తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. బ్యాలెట్ కావడం వల్ల... ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమైనా మధ్యాహ్నానికల్లా అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.