Bandi Sanjay Praja Sangrama Yatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 2న బండి పాదయాత్ర షురూ కానుంది. 24 రోజుల పాటు ఆయన యాత్ర సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. 328 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. లక్ష్మీ నరసింహుడు కొలువుదీరిన యాదాద్రిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బండి సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. గతంలో చేసిన రెండు యాత్రలకు విభిన్నంగా చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం.. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్తున్నారు.
బండి సంజయ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగాం, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమతో కలిపి మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 25 మండలాల మీదు యాత్త సాగుతుంది. మొత్తంగా 328 కిలోమీటర్లు బండి సంజయ్ నడువనున్నారు.
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గుండా కొనసాగనుంది. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, రజాకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని ఖిలాషాపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతో పాటు ఐనవోలు మల్లన్న ఆలయ ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా యాత్ర చేయనున్నారు. ముందు రెండు విడతల్లో బండి చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని పార్టీ శ్రేణులు భావిస్తుండగా.. మూడో విడతను కూడా విజయవంతం చేసేలా భాజపా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు వారికి తామున్నామనే భరోసా కల్పించడానికి తోడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని కాషాయదళం భావిస్తోంది.
తొలి విడత పాదయాత్రను బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుస్నాబాద్ వరకు నిర్వహించారు. రెండో విడతను జోగులాంబ నుంచి మహేశ్వరం తుక్కుగూడ వరకు కొనసాగించారు. అయితే.. జూన్ 23 నుంచి జూలై 12 వరకు మూడో విడత పాదయాత్ర, ఆగస్టులోపు నాలుగో విడత పాదయాత్ర కూడా పూర్తిచేయాలని తొలుత బండి సంజయ్ భావించారు. కానీ.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మూడో విడత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఫలితంగా.. ఆగస్టు 2న మూడో విడత ప్రారంభం కానుంది. యాత్రను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. యాత్రకు భాజపా పాలిత ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రానున్నారు. అసెంబ్లీ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న పాదయాత్ర భూదాన్ పోచంపల్లిలో సాగనున్న నేపథ్యంలో అక్కడ బహిరంగ సభను నిర్వహించేందుకు భాజపా ప్లాన్ చేస్తోంది. ఈ సభకు కేంద్ర చేనేత శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భాజపాలో చేరుతారన్న వార్తల దృష్ట్యా.. మునుగోడు నియోజకవర్గంలోనూ సభ నిర్వహించే అవకాశం ఉంది.
భాజపాకు బలంలేని ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పాదయాత్ర జరుగుతుంది కాబట్టి.. ఇదే అదునుగా పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాలని భావిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. చివరగా.. హన్మకొండలోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు లక్షల మందితో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చూడండి: