నిజామాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్లాలంటే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నుంచి వర్ని వరకు ప్రయాణించాలంటే మాత్రం నరకం చవిచూస్తున్నారు. గతుకులు, గుంతలు, కంకర రాళ్లతో అవస్థలు పడుతున్నారు. రహదారిపై పెద్దపెద్ద గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఏ గుంతలో పడాల్సి వస్తుందోనన్న భయంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో అరగంట ప్రయాణం కాస్త రోడ్డు సరిగా లేక గంటకుపైగా సమయం పడుతోంది.
నిజామాబాద్-వర్ని మధ్యలో 25కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపించారు. అయితే అటవీ అనుమతులు రాకపోవడం వల్ల వర్ని నుంచి మోస్రా వరకే గత జనవరిలో పనులు చేపట్టారు. వర్ని నుంచి మోస్రా సాయిబాబా ఆలయం వరకు... 30కోట్ల వ్యయంతో 14కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్ని, చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో నాలుగు వరుసల రహదారి.... వర్ని మండలం కేంద్రంలో సెంటర్ మీడియన్, డ్రైన్ పనులు..... చందూర్, మోస్రా కేంద్రాల్లో సెంటర్ మీడియన్ పనులు నిర్మాణంలో భాగంగా చేయాల్సి ఉంది. ప్రస్తుతం వర్ని నుంచి ఆఫందిఫారం వరకు 5కిలోమీటర్ల రహదారి పూర్తి కాగా.. వర్ని మండలం కేంద్రంలో సెంటర్ మీడియన్ పూర్తి చేశారు. చందూర్ మండలం కేంద్రంలో పనులు సాగుతున్నాయి. అయితే మోస్రా, చందూర్ మండలాల పరిధిలో 2.5కిలోమీటర్ల అటవీ భూమి ఉంది. అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించగా.. ఇంకా ఆమోదం రాలేదు.
నిజామాబాద్ నుంచి మోస్రా వరకు గుంతలు, కంకర తేలిన రోడ్డు దర్శనమిస్తుండగా... మోస్రా నుంచి చందూర్ వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వేసిన కంకర, మట్టితో దట్టంగా దుమ్ము లేస్తోంది. ఆఫందిఫారం నుంచి వర్ని వరకు కొత్తగా వేసిన బీటీ రోడ్డు పలు చోట్ల పగిలిపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వర్ని నుంచి మోస్రా వరకే పనులు చేపట్టడం వల్ల... అక్కడి నుంచి నిజామాబాద్ వరకు ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.
అటు వర్ని నుంచి బాన్సువాడ వరకు రోడ్డు విస‌్తరణ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. నిజామాబాద్ - బాన్సువాడ రహదారిలో వేలాదిగా వాహనాలు తిరుగుతాయి. వాణిజ్య, వ్యాపార అవసరాల నిమిత్తం భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా స్పందించి ఈ ప్రధాన రహదారి విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలని వాహనాదారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 44వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీలే అధికం