కరోనా మహమ్మారి విజృంభణతో.. బయటి తిండి, పానీయాలు జనం ముట్టుకోవడం లేదు. రోడ్లపై టిఫిన్లు, టీలు, ఇతర పానీయాలు తీసుకోవడం దాదాపు మానేశారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అందుకు పాత ఆహార నియమాల వైపు మళ్లుతున్నారు. ప్రధానంగా కషాయం, అల్లం, శొంఠితో తయారు చేసిన ఛాయ్, బాదం, పసుపు పాలు వంటివి ప్రజలు అధికంగా సేవిస్తున్నారు.
యాంటీ కరోనా స్పెషల్..
అన్‌లాక్ తర్వాత వినియోగదారులు లేక టీ, కాఫీ స్టాళ్లు వెలవెలబోతున్నాయి. నిర్వాహకులు ప్రజా అభిరుచులకు తగ్గట్లు టీ, ఇతర పానీయాలు తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. అల్లం, శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి పదార్థాలతో కషాయంతో పాటు ఛాయ్‌లు తయారు చేసి ఇస్తున్నారు. వేడి పాలల్లో పసుపుతోనూ... నిమ్మ రసం, తేనెను వేడి నీళ్లలో వేసి అందిస్తున్నారు. యాంటీ కరోనా స్పెషల్ టీ అని బోర్డులు పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌కు సమీపంలో పలు టీ, కాఫీ షాప్‌లలో ఈ పానీయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం లేని వాళ్లు, వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వారికి స్పెషల్ టీలు ఉపయోగపడుతున్నాయి.
జనం నుంచి ఆదరణ..
ఆరోగ్య రక్షణకు మేలు చేసేలా తయారు చేస్తున్న పానీయాలకు జనం నుంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా మిగతా వాళ్లు సైతం తాము వ్యాపారాల్లో మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని యోచిస్తున్నారు.
ఇవీ చూడండి: బక్రీద్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి సమీక్ష