నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌తో పసుపు రైతుల ముఖాముఖి అసంపూర్తిగా ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన చర్చ ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. నేను చేసింది చెప్పాను... నిర్ణయం మీదేనంటూ అర్వింద్ వెళ్లిపోగా... పది రోజుల్లో స్పష్టమైన వైఖరి చెప్పకుంటే అడుగడుగునా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే బోర్డు తెస్తానని ఇచ్చిన హామీ మేరకు అర్వింద్‌తో రైతులు చర్చించారు. పసుపు బోర్డు, మద్దతు ధర హామీ గురించి రైతులు ముఖాముఖిలో ప్రశ్నించారు.
ఎంపీగా గెలిచిన నుంచి హామీ మేరకు తాను చేసిన పనుల గురించి అర్వింద్ వివరించారు. అయితే బోర్డు, మద్దతు ధర మాట లేకుండా మాట్లాడుతున్నారంటూ... పలుమార్లు అర్వింద్ ప్రసంగాన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోర్డుకు మించి రైతుల కోసం కృషి చేస్తున్నానని అర్వింద్ చెబితే... బోర్డు, మద్దతు ధర తప్ప ఏదీ అక్కర్లేదని రైతులు తేల్చి చెప్పారు. నాలుగు గంటల పాటు చర్చ జరిగినా ఎలాంటి పరిష్కారం లేకపోయింది. చివరకు తాను చేసింది చెప్పానంటూ అర్వింద్ సమావేశం నుంచి వెళ్లిపోగా.. ఎంపీ డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు