ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికే కొవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు కొవిన్ యాప్లో పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ అందజేస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసిన ప్రైవేటు అంబులెన్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నిబంధనల ప్రకారం వసూలు చేయని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబ్బులు ఎక్కువగా అడిగిన అంబులెన్స్ డ్రైవర్లు, ప్రైవేట్ వాహన యజమానులపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
- ఇదీ చూడండి: ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్పై హైకోర్టులో విచారణ