తెలంగాణ విశ్వవిద్యాలయ(Telangana University) పరీక్షల విభాగంలోని అధికారుల అలసత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు జారీ చేసిన మెమోల్లో తప్పులు దొర్లాయి. మార్చిలో బీఈడీ విద్యార్థుల మెమోల్లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించి తప్పులు సరిదిద్దారు.
ఏం జరిగిందంటే..
వర్సిటీ(Telangana University) పరిధిలోని 2017-20 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జులై-ఆగస్టులో బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించారు. 2 వేల మంది హాజరుకాగా 500 మంది వరకు ఉత్తీర్ణత సాధించారు. కాగా వారికి జారీ చేసిన కన్సాలిడేటెడ్, ప్రొవిజినల్ మెమోల్లో అనేక తప్పులు(mistakes in provisional memos) దొర్లాయి. 200 మందికి ఇలా జరిగినట్లు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలోనే 10 మంది విద్యార్థులున్నట్లు గుర్తించారు.
వివరాలు పరిశీలించలేదా?
బీ.కామ్ కంప్యూటర్స్‌లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థికి కన్సాలిడేటెడ్ మెమోలో ‘బీ.కామ్ కంప్యూటర్స్’ అని, ప్రొవిజినల్ సర్టిఫికేట్(mistakes is provisional cetrificate)లో ‘బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్’ అని వచ్చింది. చాలా మంది విద్యార్థులకు చదివిన గ్రూప్ కాకుండా మరొకటి నమోదు కావడం గమనార్హం.
మెమోలు ప్రింట్ చేసే సమయంలో విద్యార్థుల పేర్లు, అభ్యసించిన గ్రూపు వంటి వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇవేం చూడకుండా ప్రింట్ తీసి కళాశాలలకు మెమోలు జారీ చేసేశారు. దీంతో తప్పుులు దొర్లినట్లు గుర్తించిన విద్యార్థులు, కళాశాలల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ‘పని ఒత్తిడిలో ఇలా జరిగిందని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని అధికారులు జవాబిస్తున్నారని’ విద్యార్థులు వాపోతున్నారు.
సాంకేతిక సమస్యతో..
"డిగ్రీ మెమోల్లో తప్పులు దొర్లిన మాట వాస్తవమే. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే పని ఒత్తిడికి తోడూ సాంకేతిక సమస్యలతో ఇలా జరిగింది. మెమోల్లోని తప్పులను సరిదిద్దుతాం. "
- ఆచార్య అరుణ, పరీక్షల నియంత్రణాధికారి తెవివి
- ఇదీ చదవండి : 'రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్ డోసు!'