కరోనా బారిన పడకుండా మాస్కులు రక్షణగా నిలుస్తున్నాయి. మాస్క్ ధరించి, జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో మంది కొవిడ్ సోకకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఎక్కువగా క్లాత్, సర్జికల్, ఎన్-95 (N-95) మాస్కులను వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చీఫ్‌లు, క్లాత్ మాస్క్‌లు వినియోగిస్తున్నారు. ఒకే మాస్క్‌ను దీర్ఘకాలం వాడితే బ్లాక్ ఫంగస్(black fungus) ముప్పు ఉందని ఇటీవల ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరించారు. 2-3 వారాలపాటు ఒకే మాస్క్‌ను ధరిస్తే ఫంగస్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. సమూహంలోకి వెళ్లినప్పుడు డబుల్ మాస్క్(double mask) ధరించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
అవగాహన అవసరం..
డబుల్ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సర్జికల్‌తో పాటు క్లాత్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్ ధరించే ముందు, తర్వాత చేతులను శానిటైజ్ చెసుకోవాలి. క్లాత్ మాస్కులను ఒకరిది మరొకరు వాడకూడదని సూచిస్తున్నారు.ఎన్-95(N-95) మాస్కుల విషయంలోనూ అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు.
వారాల తరబడి ఒకే మాస్క్..
సర్జికల్ మాస్క్ ధరించి పైనుంచి క్లాత్ మాస్క్ పెట్టుకుంటే 85శాతం వరకు రక్షణ లభిస్తుందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ పరిశోధనల ఆధారంగా తేల్చింది. కొందరు రోజులో కొద్దిసేపే వాడుతున్నామని.. వారాల తరబడి ఒకే మాస్క్ వినియోగిస్తున్నారు. ఇది కూడా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తడిచిన, చెమట పట్టిన, తేమ చేరిన మాస్కులను పెట్టుకోకూదని స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యం బారినపడకుండా ముందుగానే అవగాహనతో వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చూడండి: viral video: యువకుడిని చితకబాదిన ఎస్సై