ఈ సీజన్‌లోనూ రైతులకు ధాన్యం విక్రయ కష్టాలు తప్పడం లేదు. నాణ్యతలేమి పేరుతో మిల్లర్లు ధరలో భారీగా కోతలు విధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. బోధన్ డివిజన్‌లో పంట కోతలు పూర్తికాగా.. నిజామాబాద్, ఆర్మూర్‌లో 80 శాతం వరకు పూర్తయ్యాయి. 10.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 456 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా.... ఇప్పటి వరకు 300కు పైగా కేంద్రాల్లో సేకరణ ప్రారంభమైంది. ప్రైవేటు వ్యాపారులు కొనగా.. దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంటుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. 'ఏ' గ్రేడ్‌కు మద్దతు ధర 1960 రూపాయలు కాగా... కామన్ గ్రేడ్‌కు 1940 చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం లోపు తేమ ఉండేలా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
ఒక్క బస్తాలో ఉన్నా..
అధికారుల సూచన మేరకు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొచ్చినప్పటికీ... తేమ పేరుతో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లు అన్నదాతల్ని నిలువునా ముంచుతున్నారు. నాణ్యతా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ... ధాన్యానికి కడ్తా తీస్తున్నారు. దీనికి తోడు రైస్ మిల్లర్ల అదనపు దోపిడీ శాపంగా మారింది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు పంపిన ధాన్యంలో మళ్లీ తేమ శాతం లెక్కిస్తున్నారు. 17 శాతం కంటే ఎక్కువ ఉందంటూ... కడ్తా ఇస్తే తప్ప లారీలో నుంచి బస్తాలు దించుకోమంటూ కొందరు మిల్లర్లు నిబంధనలు విధిస్తున్నారు. ఒక్క రైతుకు చెందిన బస్తాలో తేమ శాతం ఎక్కువున్నా.... ఆ లారీలోని అందరి ధాన్యం బస్తాల నుంచి తరుగు తీయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్లు చెప్పినా ఫలితం లేదు..
తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని కలెక్టర్ చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తరుగు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: తరుగు పేరుతో నిలువు దోపిడీ.. వ్యాపారులు చెప్పిందే ధర...!