కేజీబీవీల్లో పనిచేస్తోన్న నాన్‌టీచింగ్ ఉద్యోగుల వేతనాల్లో పది శాతం చొప్పున 3నెలల పాటు కోత విధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యాధికారికి నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ వినతి పత్రం సమర్పించారు. మార్చి, ఏప్రిల్, మేలో ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్లుగానే... కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాల్లో కోత విధించారని ఇన్చార్జీ ఎం.సుధాకర్ అన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగైన నేపథ్యంలో కోత విధించిన వేతనాలను విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని... ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి కోత జమ అవుతున్నాయని పేర్కొన్నారు.
కేజీబీవీ ఉద్యోగులకు ముఖ్యంగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్లకు ఇప్పటివరకు వేతనాలు జమకాలేదని... ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అధికారులు బకాయిలు చెల్లించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. కోత విధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము: కేటీఆర్