Tourist Places in Nizamabad : ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు నిజామాబాద్ జిల్లా. గోదావరి నది ఒడ్డున పక్షులు, జింకల సందడితో కూడిన అద్భుత దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఎస్సారెస్పీ ఎగువభాగం జల సవ్వడితో ఆకట్టుకుంటే... ప్రాజెక్టు వెనుక భాగం వన్యప్రాణులతో సందడిగా మారింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుగా ఉన్న శ్రీరాంసాగర్ జలాశయం సుమారు 4వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా ఇక్కడ విదేశీ పక్షుల సందడి కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లానందిపేట మండలం నడుకుడ, చిన్నయానాం, డొంకేశ్వర్, నూత్ పల్లి, గాదేపల్లి గ్రామాల్లోని..... గోదావరి పరివాహక ప్రాంతంలో జింకలు, విదేశీ పక్షులు, నెమళ్లతో సందడిగా మారింది.
జింకల గెంతులు.. : ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ తగ్గిపోగా నీళ్లకోసం జింకలు అటవీ పరిసరాలను దాటి బయటకు వస్తున్నాయి. ఎస్సారెస్పీ వెనక భాగంలో.... దాదాపు 1500లకు పైగా జింకలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గుంపులు గుంపులుగా జింకలు గెంతులు వేస్తూ కనిపిస్తున్నాయి. అరుదుగా కనిపించే కృష్ణ జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఆకట్టుకుంటున్నాయి.
"చాలా రోజుల నుంచి విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. గుంపులు గుంపులుగా జింకలు సందడి చేస్తున్నాయి. వీటిని చూడటానికి ఇతర జిల్లాల నుంచి సందర్శకులు వస్తున్నారు. కానీ రహదారులు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా అలరారుతుంది."
- స్థానికులు
పక్షుల కిలకిలలు.. : ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతం ప్రకృతి అందాలు వలస పక్షులతో కనువిందు చేస్తుంది. ఆయా దేశాల్లో శీతలగాలులు, చలిని తట్టుకోలేక ఎండ వేడిమికోసం.. పక్షులు ఇక్కడకి వస్తాయి. ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉండడంతో పక్షులు వలస వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడకు వచ్చే జంతువులు, పక్షుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.