సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తే కల్వకుంట్ల కుటుంబ చరిత్ర కనుమరుగవుతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో భాజపాను పటిష్ఠం చేసేందుకు బండి సంజయ్ కార్యాచరణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా(దాశరథి జైలు) సందర్శించారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తే ఆనాటి పోరాటయోధులను ప్రజలు స్మరించుకుంటారని తెలిపారు.
రాబోయే తరాలకు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సాధన అయినట్లు... అంతకు ముందు ఎలాంటి ఉద్యమం జరగలేదని... తానొక్కడే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడని చెప్పుకోడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఎంఐఎంతో సీఎం కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.