Govt Hostels Students problems: ఓ వైపు పారిశుద్ధ్య లోపం.. మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. చెంతనే మురుగు కుంటలు దర్శనమిస్తుండగా.... వీటి కారణంగా కుక్కలు, పందులు, ఎలుకలు, పాములు, కీటకాల సంచారం విపరీతంగా పెరుగుతోంది. తద్వారా పిల్లలు ఆ విష కీటకాల బారిన పడాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 26 ఎస్సీ వసతి గృహాలు ఉంటే 1894 మంది విద్యార్థులు ఉన్నారు. 28 బీసీ వసతి గృహాలు ఉండగా..... 2వేల 45 మంది పిల్లలున్నారు. 16 ఎస్టీ వసతి గృహాల్లో 1254 మంది విద్యార్థులు ఉంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో 30 ఎస్సీ వసతి గృహాలు ఉంటే... 1930 మంది, 27 బీసీ వసతి గృహాల్లో 1835 మంది, 21 ఎస్టీ వసతి గృహాల్లో 1,543 మంది పిల్లలు ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలతో పాటు కస్తూర్బా విద్యాలయాలకు చెందిన విద్యార్థులు వరసగా వ్యాధుల బారిన పడుతున్నారు. తాగునీటి విషయంలో స్వచ్ఛత లోపిస్తుండటం వీరిపాలిట శాపంగా మారింది. నిజామాబాద్‌లోని న్యాల్కల్ రహదారి పక్కనున్న సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలో 300 మందికి ప్రస్తుతం 192 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. 20 స్నానాల గదులు, 18 మరుగుదొడ్లు ఉండగా... వాటి తలుపులు దెబ్బతిన్నాయి. 40ఏళ్ల క్రితం నిర్మించిన నవీపేట ఎస్సీ బాలుర వసతిగృహ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కోటగిరిలో ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ 100 మంది ఉండాల్సి ఉండగా.. గదుల కొరతతో 74 మందికే చోటు కల్పించారు. రెండు గదుల పైకప్పులు శిథిలావస్థకు చేరి... వర్షాలు పడితే కురుస్తున్నాయి. 140మంది విద్యార్థులున్న బోధన్ గిరిజన బాలుర వసతి గృహం... 40 ఏళ్ల క్రితం నిర్మించినది కావటంతో... పైకప్పు పెచ్చులూడుతోంది. పక్కనే శిథిలమై వృథాగా ఉన్న బీసీ వసతి గృహ భవనం, ప్రహరీ పక్కన పెరిగిన పొదలు విషకీటకాలకు స్థావరాలుగా మారాయి. ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకులంలో 545 మంది విద్యార్థులు ఉంటే ప్రహరీ లేకపోగా పరిసరాలు ఆధ్యానంగా ఉన్నాయి. నెలరోజుల క్రితం హాస్టల్లో నిద్రిస్తున్న 10 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 15 రోజుల కిందట ఆహారం వికటించి 151 మంది అస్వస్థతకు గురయ్యారు.
పెద్దకొడపగల్ సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహంలో రెండు నెలల కిందట ఏడో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వర్షం వచ్చిందంటే పరిసరాల్లోకి నీరంతా చేరుతోంది. గాంధారి బీసీ బాలుర వసతిగృహం గోడ కూలిపోయింది. సెప్టిక్ ట్యాంకు లేకపోవడంతో మరుగుదొడ్డి కనెక్షన్ ఇంకుడు గుంతలో వదిలేశారు. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఉండలేని పరిస్థితి నెలకొంది. బీర్కూర్ కస్తూర్బా పాఠశాల, జూనియర్ కళాశాలలో 340 మంది ఉండగా.. వెనుకవైపు పొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది. ఇటీవల ప్రత్యేకాధికారిణి గదిలోకి పాము ప్రవేశించింది. బీర్కూర్ బీసీ బాలుర వసతిగృహంలో మరుగుదొడ్ల పక్కన, స్నానాలు చేసే వద్ద దట్టమైన పొదలు పెరిగి అపరిశుభ్రత నెలకొంది. ఓ విద్యార్థి పాముకాటుతో చనిపోయాడు. అనంతరం పరిసరాలు శుభ్రం చేస్తుండగా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులనూ పాము కాటేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.
పిట్లంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్బా విద్యాలయం పరిసరాలు చిట్టడివిని తలపిస్తున్నాయి. విషకీటకాలు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. జుక్కల్ మండలంలో నాలుగు వసతిగృహాలుంటే మూడింటికి ఇన్ఛార్జి సంక్షేమాధికారులే ఉన్నారు. విద్యార్థులకు ఏ జబ్బు చేసినా మాత్రలు ఇస్తున్నారు. ఖండేబల్లూర్ వసతిగృహం శివారులో ఉండటంతో బయటి వ్యక్తులు చొరబడి పిల్లల చెడు వ్యసనాల బాటపట్టిస్తున్నారు. మద్నూర్ షెడ్యూల్ కులాల బాలుర వసతిగృహంలో మెనూ పాటించట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర ప్రత్యేక వసతిగృహంలో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. బీర్కూర్‌లో సస్పెండైన వార్డెన్ ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వసతి గృహాల్లో ఉండాలంటేనే భయంతో వణికిపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిసరాల పరిశుభ్రతతో పాటు... జాబితా ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: