యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బుర్ర జహంగీర్, పుష్పలత దంపతులు కిరాణా దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవన గమనంలో చేపల కూర విషాదాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా చేపల కూర తినగా.. మిగిలిన కూరను శుక్రవారం కూడ జహంగీర్, పుష్పలత తిన్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పుష్పలతకు కడపు నొప్పి వచ్చింది. చేపల కూర అరకగపోవడంతో కడుపు నొప్పి వచ్చిందని భావించిన పుష్పలత భర్త.. మంచినీరు తాగి విశ్రాంతి తీసుకోమన్నాడు. అరగంటలోనే పుష్పలతకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తగా.. హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుడికి జహంగీర్ సమాచారమిచ్చారు. వెంటనే పుష్పలతను హైదరాబాద్ తీసుకురావాలని జహంగీర్‌కు సూచించారు.
అదే సమయంలో జహంగీర్‌కు కూడ కడుపునొప్పి వచ్చి.. శ్వాస సరిగా ఆడకపోవడంతో ఓ ప్రైవేటు వాహనంలో భార్యభర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలోనే పుష్పలత మృతి చెందగా, అప్పటికే పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకున్న జహంగీర్‌కు యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నతనంలో తల్లిని కోల్పోవడం, తండ్రి అపస్మారక స్థతిలో ఉండడంతో ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆహారం వికటించడమే పుష్పలత మరణానికి కారణమని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: 'గిరిజనుల అభ్యున్నతి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది...?'