పేదలకు ఆహారభద్రత కార్డులు జారీ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటతో... దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా... ఇప్పటికే 78 వేల మందికి పైగా కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో గత డిసెంబరు నాటికి 35,356 మంది... పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఆర్ఐ స్థాయిలో 16,255, తహసీల్దార్ స్థాయిలో 3,094, డీఎస్వో వద్ద 16,007 విచారణలో ఉన్నాయి.
నూతన యూనిట్ల చేర్పు, కార్డుల బదలాయింపు తదితర మ్యుటేషన్ల కోసం 42,911 దరఖాస్తులు రాగా... అవన్నీ పెండింగ్లో పడిపోయాయి. యూనిట్లు పెంచకపోవడంతో... కుటుంబాల్లో పెరిగిన సభ్యులు లబ్ధి పొందడం లేదు. కార్డులు ఎప్పుడు జారీ చేస్తారంటూ... తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
కార్డుంటేనే సర్కారు సాయం..
నల్గొండ జిల్లాలో 15,415, సూర్యాపేటలో 11,801, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,140 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 16, 907, సూర్యాపేట జిల్లాలో 13,423, యాదాద్రి జిల్లాలో 12,581 మంది పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల... కార్డు లేని వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోని సరకులు... రాయితీపై పొందలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్రా సర్కారు సాయం పొందాలంటే... ఆహారభద్రత కార్డులు తప్పనిసరి. అవి లేకపోవడంతో... దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు అవస్థలు పడుతూనే ఉన్నారు.
ఇదీ చూడండి: భూములు తీసుకున్నారు సరే.. పరిహారం మాటేంటి మరి..?