Munugode By Election Nominations Start: మునుగోడు ఉపఎన్నికల సమరానికి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఉపఎన్నికకు సంబంధించి ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా... నేటి నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా ఉంటుంది. ఆదివారం, రెండో శనివారం, సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని అధికారులు తెలిపారు.
నామినేషన్ పత్రాలను చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తున్నారు. సింగిల్ విండో పద్ధతిన చండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 48 గంటల ముందు దరఖాస్తు చేస్తే 48గంటల లోపల ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిన అనుమతులు జారీ చేయనున్నారు. నవంబరు 3న పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. నవంబరు 6న ఓట్ల లెక్కింపు జరగనుండగా... 8వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
మునుగోడు ఉపఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నల్గొండ కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల సంఘం ఈ నెల 3న ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసినందున అదే రోజు నుంచి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు చెరిపివేశారు. ఎన్నికల నియమావళి అమలుకు 16 ఎంసీసీ బృందాలు, సభలు, సమావేశాలు వీడియోగ్రఫీకు 7-వీఎస్టీ బృందాలు, డబ్బు మద్యం పంపిణీ అరికట్టేందుకు వాహనాల తనిఖీల కోసం 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 18 ఎస్ఎస్టీ బృందాలు ఏర్పాటు చేశారు.
కాగా... నామినేషన్ల తొలిరోజే మునుగోడు మండలం గూడాపూర్ చెక్‌పోస్ట్ వద్ద 13 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు... నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టారు. చండూర్ మండలం ఉడుతలపల్లి వద్ద చెక్‌పోస్ట్‌ను జేసీ భాస్కర్ రావు పరిశీలించారు. ప్రభుత్వ అతిథిగృహాలను, వాహనాలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి గరిష్ఠ ఎన్నికల వ్యయపరిమితి 40లక్షలుగా అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సామగ్రి ఖర్చులను రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశంలో ఖరారు చేశారు.
ఇవీ చదవండి: