pollution from pharma companies: ఈ దృశ్యాలు చాలు... ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కొన్ని ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్య ప్రభావాన్ని చెప్పేందుకు...! బోర్ల నుంచి బుసలు కొడుతున్న విషపు జలాలు ఎంతటి స్థాయిలో పాతాళగంగను గరళంగా మారుస్తున్నాయో వివరించేందుకు...! ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని పోచంపల్లి, చిట్యాల, చౌటుప్పల్, బీబీనగర్, భువనగిరి మండలాల్లోని చాలా గ్రామాల్లో ఎటు చూసిన ఫార్మా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. కంపెనీల సమీపంలోని గ్రామాల ప్రజలు... జల, వాయు కాలుష్యంతో కీళ్లనొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యలతో పాటూ అంతుచిక్కని వ్యాధులతో సతమతమవుతున్నారు.
ఈ భూములు ఏ పంటకూ పనికిరావు:
ground water pollution: ఫార్మా కంపెనీలు యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను భూమిలోకి వదలడంతో భూగర్భజలాలు విషతుల్యంగా మారిపోతున్నాయి. బోర్ల నుంచి వస్తున్న నీరు పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది. నీటిలో నురగలు, తెట్టు ఏర్పడుతోంది. వరి వేస్తే దిగుబడులు రావడం లేదని, పత్తి పంట ఎదుగుదలలో లోపం వస్తుందని, వేరుశనగ పంట తొలిదశలోనే మాడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఈ భూములు ఏ పంట సాగుకూ అనుకూలంగా ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫార్మా కంపెనీలు పట్టించుకోవడం లేదు:
ఔషధాల ఉత్పత్తి అనంతరం విడుదలయ్యే వ్యర్థాలను నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నా... ఫార్మా కంపెనీలు పట్టించుకోవడం లేదు. కాలుష్యకరమైన వ్యర్థాలను భూగర్భలోనికి వదలడం, లేదంటే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న చిన్న చిన్న కుంటల్లో పారబోస్తున్నారు. దీంతో కుంటలు, చెరువుల్లో ఉన్న చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవలే ఫార్మా వ్యర్థాలను చెరువులోకి వదలడంతో చిట్యాల మండలం వెలిమినేడు చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయి. రెండు నెలల క్రితం ఇదే మండలంలోని గుండ్రాంపల్లి చెరువులో 15 లక్షల విలువైన చేపలు కాలుష్యంతో చనిపోవడంతో ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు.
100 మందికి పైగా పెళ్లికాని వారు..
పరిశ్రమల ప్రభావం మనుషులకే కాదు, మూగ జీవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక్కడి భూగర్భజలాల వల్ల పండిన గడ్డిని తినడం వల్ల ఆవులు, గేదేల్లో గర్భం-చుడి నిలవడం లేదు. దీంతో మూగజీవాలను సాకడం భారంగా మారడంతో రైతులు వాటిని కబేళాలలకు అమ్మేస్తున్నారు. ఫార్మా కంపెనీల కాలుష్యంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ గ్రామాల్లోని అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. పరిసర గ్రామాల్లో సగటున 100 మందికి పైగా యువతీయువకులు పెళ్లికాని వారు ఉన్నారంటే... పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఫార్మా కంపెనీల కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో తమ మనుగడకు ముప్పు ఏర్పడుతోందని... ఈ ప్రాంతంలోని ఐదుగురు రైతులు ఇటీవలే జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ని ఆశ్రయించారు.
ఇదీ చూడండి: సిరిసిల్లలో మోడ్రన్ ధోబీఘాట్.. ఆధునిక సొబగులు దిద్దుకుంటున్న రజక వృత్తి