ప్రచార ప్రణాళిక
ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతున్నందున... ప్రధాన పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో ఐదారు మండలాల చొప్పున 35 నుంచి 40 మండలాలు చుట్టివచ్చేలా ప్రణాళిక వేసుకున్నారు. నల్గొండలో అధికార పార్టీ నుంచి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. భువనగిరిలో తెరాస అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకున్న భాజపా... నరేంద్ర మోదీ ఛరిష్మా కలిసి వస్తుందన్న భావనతో లోక్సభ బరిలో అభ్యర్థుల్ని దింపింది. నల్గొండలో గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరిలో పీవీ శ్యాంసుందర్ ఇప్పటికే మండలాల పర్యటనలు పూర్తి చేశారు.
సర్వేల ఆధారంగా...
అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలాబలాలపై ప్రధాన పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. ఏయే స్థానాల్లో వెనుకబడ్డారో అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రత్యేక సంస్థలతో సర్వే నిర్వహించి ఎప్పటికప్పుడు అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి... సర్వే ఆధారంగానే ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనుచరులతో పరిస్థితులపై అంచనా వేసి ప్రచారం ముగిసే నాటికి లోపాలను సవరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
తెరాస అభ్యర్థుల తరఫున మంత్రితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రచార బాధ్యతలు పంచుకుంటున్నారు. నల్గొండ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో గుత్తాకు పట్టుండటం గులాబీ పార్టీకి కలిసిరానుంది. కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డే స్వయంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటుండగా... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు బాధ్యతలను ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ పర్యటనలతో శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్టు కనిపిస్తోంది. రాహుల్ రాకతో కార్యకర్తల్లో పెరిగిన నూతనోత్తేజంతో గెలుపు తమదేనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అమిత్ షా రోడ్ షో రద్దు అయినప్పటికీ... రాజాసింగ్ పర్యటనతో కమల దళంలో ఉత్సాహం కనిపిస్తోంది. వామపక్షాలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. నల్గొండలో సీపీఎం, భువనగిరిలో సీపీఐ పోటీలో ఉన్నాయి.
ఇవీ చూడండి: శివార్లపై కన్నేసిన కాంగ్రెస్.. ఆ రెండు ఖాయమేనా?