labors Stuck in Flood: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం, కొత్తపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిన్న.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో 23 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలం నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం... రాత్రి కావడం, వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
బోటు సాయంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో డ్రోన్ సాయంతో బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఉదయం 6 గంటలకు బోటు సహాయంతో వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం.. బాధితులకు లైఫ్ జాకెట్లు అందజేసి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయక బృందాలకు కూలీలు ధన్యవాదాలు తెలిపారు.