నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ అధికార తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. హాలియాలో సమావేశం నిర్వహించిన మంత్రి తలసాని... జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. నిడమనూరు మండలం ఊట్కూరు, లక్ష్మీపురం, నందికొండూరి గూడెం, మారుపాక సహా వివిధ గ్రామాల్లో... మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి నోముల భగత్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు.
వైరల్ వీడియో..
పలుచోట్ల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికార పార్టీ అభ్యర్థి తమ గ్రామానికి వస్తున్నాడని..... ఇంటి వద్ద ఉండి సమావేశానికి హాజరైన వారికి 200 రూపాయలు ఇస్తామంటూ గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
సర్వశక్తులూ ఒడ్డుతోన్న కాంగ్రెస్ ..
తెరాసను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్... త్రిపురారం మండలం బుడ్డితండాలో ఓటర్లతో సేవాలాల్ సాక్షిగా ప్రమాణం చేయించడాన్ని నిరసిస్తూ... కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు నేతృత్వంలో... త్రిపురారం పోలీసు ఠాణా వద్ద బైఠాయించారు. శంకర్ నాయక్ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని... ఆయన్ను అక్కణ్నుంచి వెంటనే పంపివేయాలంటూ నిరసన బాట పట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, శాసనసభ్యురాలు సీతక్క... పెద్దవూర మండలం బట్టుగూడెంలో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన వారంతా... పిట్టల్లా రాలిపోతున్నారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల వేటలో కమలం..
అనుముల మండలం చింతగూడెం, రామడుగు, శ్రీనాథపురం, కేకే కాల్వ గ్రామాల్లో... భాజపా అభ్యర్థి రవికుమార్ ఓట్లు అభ్యర్థించారు. తిరుమలగిరి మండలం చింతలపాలెం, నాయకుని తండాలో... తెదేపా అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్ ఓటర్లను కలుసుకున్నారు.
ఇవీ చూడండి: జోరుగా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం