బతుకమ్మ, విజయదశమి సంబురాలు సామూహికంగా జరుపుకోవడం వల్ల సంకట స్థితిలో పడొద్దని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రతి పండగను జరుపుకోవాల్సిందేనని... అదే సమయంలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అందుకే బతుకమ్మను ఇంటి వద్ద జరుపుకోవాలని, సామూహిక జమ్మిపూజల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజాగా కురిసిన వర్షాలతో రోగాలు మరింత ప్రభలే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు కూడా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. వాటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చర్యల్లో... ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం విస్మరించొద్దన్నారు. ఓనం వేడుకలు సామూహికంగా జరుపుకోవడం వల్ల కేరళలో కొవిడ్ మళ్లీ విజృంభించిందని వివరించారు. అలాంటి పరిస్థితి మన దగ్గర పునరావృతం కాకుండా వేడుకలు జరుపుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ