నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదైంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో నిన్న చోటుచేసుకున్న ఘటనపై.. పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారంటూ చౌటుప్పల్ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డుల పంపిణీకి ఆటంకం కలిగించడమే కాకుండా.. ఆయన అనుచరులు సభా వేదికపై గందరగోళం సృష్టించారని, మంత్రి చేతిలోని మైకును ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది...
లక్కారంలో నిర్వహించిన కొత్త రేషన్ కార్టుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత పాలకులు వైఫల్యాలను ప్రస్తావిస్తూనే తెరాస చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు అంటూ ఎమ్మెల్యే అడ్డుకునే క్రమంలో ఇరువురు నేతల మాటామాటా పెరిగింది. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని నిరసన తెలిపిన రాజగోపాల్ రెడ్డి... ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. కాంగ్రెస్, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోగా పోలీసులు వారిని వారించారు.
రాజగోపాల్‌రెడ్డి వాదనిది..
ప్రతిపక్ష శాసనసభ్యుడు కావడం వల్లే చిన్నచూపు చూస్తూ కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని... మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... కార్యకర్తలతో కలిసి హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా అభివృద్ధిని ఏనాడు కాంక్షించని మంత్రి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం, మంత్రి జగదీశ్ రెడ్డి లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సునిశిత విమర్శలు చేశారు. ఉత్తర తెలంగాణకు వేల కోట్ల నిధులు కుమ్మరిస్తున్న సర్కార్... నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. బ్రాహ్మణవెల్లంల, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన కోమటిరెడ్డి... మంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు జగదీశ్ రెడ్డికి లేదంటూ విమర్శించారు.
తిప్పికొట్టిన మంత్రి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలను మంత్రి జగదీశ్ రెడ్డి తిప్పికొట్టారు. ప్రతిపక్ష సభ్యులు ఉనికి కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారంటూ మంత్రి చురకలు అంటించారు.
ఇదీచూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం