wonder kid in mancherial: ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్న తొమ్మిది నెలల్లోనే సకల శాస్త్రాలు నేర్చుకున్నట్లు.. ఈ చిన్నారి లాక్డౌన్ తొమ్మిది నెలల్లో భగవద్గీత అధ్యాయాలను బట్టిపట్టేసింది. బువ్వ తినడానికే మారం చేసే వయసులో వాహ్వా..! అనిపించే బుద్ధిని తన సొంతం చేసుకుంది. పదాలు పలకడానికే తడబడే పెదవులతో భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా ఉచ్ఛరిస్తోంది. తన వయసున్న పిల్లల్ల పేర్లు ఇప్పుడిప్పుడే పాఠశాల రిజిస్టార్లో చేరుతుంటే.. తాను మాత్రం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనే స్థానం సంపాదించుకుంది.
మంచిర్యాలలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన నామనీ రమేష్‌కుమార్, మౌనిక దంపతుల గారాలపట్టి వెంకటఅద్విక. ఆరేళ్ల ఈ చిన్నారి స్థానిక కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది. అద్వికలో ఉన్న జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి.. లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. భగవద్గీత అధ్యాయాలను గోరుముద్దలతో కలిపి నేర్పించింది.
సంపూర్ణంగా రెండు అధ్యాయాలు... మంత్రపుష్పం..
భగవద్గీతలో ఉన్నా 18 అధ్యాయాలలో మొదటి రెండు పర్వాలను అద్విక కంఠస్థం చేసింది. నిరంతర సాధనతో రెండు అధ్యాయాలను అనర్గళంగా అప్పజెప్పేస్తోంది. పూజ చివర్లో చెప్పే మంత్రపుష్పాన్ని నేర్చుకుంది. దేవుని శ్లోకాలు, పద్యాలు మరెన్నో నేర్చుకుని.. తడబడకుండా చెబుతూ.. ఆశ్చర్యపరుస్తోంది.
నాలుగేళ్ల వయసులోనే రికార్డు...
ఈ చిన్నారి చిన్నప్పటి నుంచే జ్ఞాపకశక్తిలో మేటి. నాలుగేళ్ల వయసులోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. 9 నిమిషాల వ్యవధిలో 333 జనరల్నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అద్విక రికార్డు నెలకొల్పింది.
కర్ణాటక సంగీతం...
భారతీయ శాస్త్రీయ సంగీతమైనా కర్ణాటక సంగీతాన్ని చిన్నారి అద్విక నేర్చుకుంటోంది. ఆన్లైన్ వేదికగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహిస్తున్న సాధన కార్యక్రమాలలో పాల్గొంటూ మెలుకువలు నేర్చుకుంటోంది. తాను జీవితంలో కోరుకున్న ఉన్నత లక్ష్యాలను చేరేందుకు.. అన్ని వేళలా తోడుండి తమ వంతు కృషి చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: