ప్రజలు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే టెలీ మెడిసిన్ కేంద్రానికి ఫోన్‌చేసి సమస్య ఏంటో చెప్పి తక్షణమే టెలిఫోన్ ద్వారా వైద్యం పొందవచ్చన్నారు కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా. 9010591787 కు ఫోన్ చేసి వారి ఆరోగ్య సమస్యను చెప్తే స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా చికిత్స అందిస్తారని కలెక్టర్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆమె టెలీ మెడిసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అవసరమైతే వయసు పైబడిన వారికి ఆశ కార్యకర్తల ద్వారా మందులు సైతం అందించి.. వ్యాధి నయమయ్యే వరకు పర్యవేక్షిస్తారని అన్నారు. ఉదయం నుండి సాయంత్రం టెలీ మెడిసిన్ అందుబాటులో ఉంటుందని.. ఆ మేరకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో జిల్లాలోని ప్రజలు వైద్య సేవలకు ఇబ్బంది పడకుండా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. ఇది లాక్డౌన్ తర్వాత కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉంటే రోగిని ఇతర ఆసుపత్రులకు పంపించేందుకు అంబులెన్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవో కె.చంద్రారెడ్డి,డిఎస్పీ కిరణ్ కుమార్,జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరేష్ కుమార్‌లతో కరోనాపై సమీక్షించారు. లాక్డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాలలో ఇటుకల తయారీ, చేనేత, స్టోన్ క్రషింగ్.. ఇతర మరమ్మతుల వంటి కార్యకపాలు చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతానికి ఇది వర్తించదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కూలీ లేదాయె.. కడుపు నిండదాయె