భీమా ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ వద్ద రంగసముద్రం, కానాయపల్లి వద్ద శంకరసముద్రం జలాశయాలను నిర్మించారు. రంగసముద్రం కింద నాగరాల గ్రామం ముంపునకు గురి కాగా.. వారికి మూడు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ నిర్వాసితులకు అందాల్సిన పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందలేదు. దీంతో ముంపు గ్రామాన్ని వీడి పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు నిర్వాసిత కుటుంబాలు నిరాకరిస్తున్నాయి. వర్షాకాలం వస్తే జలాశయం పూర్తిగా నిండి ఇళ్లలోకి నీరు చేరుతోంది. అయినా సగానికి పైగా గ్రామస్థులు అక్కడే జీవనం గడపుతున్నారు.
నెలలు గడిచినా..
నాగరాల గ్రామంలో 986 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారు. వారి కోసం పునరావాస కేంద్రాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. కాని చెల్లించాల్సిన పరిహారం రాకపోవడంతో వాళ్లు సమేమిరా అంటున్నారు. భూసేకరణ జరిపి ఏళ్లు గడుస్తోంది. అప్పుడిచ్చిన పరిహారం ఇప్పుడు దేనికీ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో పునరావాసం కోసం కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్న నిర్వాసితులు..18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంలో పాటు ప్యాకేజీ వర్తింప జేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు హామీ ఇచ్చి నెలలు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వాపోతున్నారు. పునరావాస కేంద్రాల వద్ద వసతులు కల్పించడం తోపాటు 2 పునరావాస కేంద్రాల మధ్య రూ.9కోట్ల అంచనాతో నిర్మించాల్సిన వంతెనను సైతం వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
పరిహారం ఇవ్వందే..
ఇక శంకర సముద్రం జలాశయం కింద ముంపునకు గురవుతున్న కానాయిపల్లి పునరావాసంలోనూ అదే పరిస్థితి. శంకర సముద్రం కింద సుమారు 1,350 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతున్నాయి. జలాశయ నిర్మాణం పూర్తైనప్పటికీ.. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచాలంటే తక్షణం 250 ఇళ్లు ఖాళీ చేయించాలి. సుమారు రూ.14 కోట్ల వ్యయంతో గ్రామానికి దగ్గర్లోనే పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. రూ.7కోట్లు ఖర్చుతో రోడ్లు, మురికి కాల్వలు, విద్యుత్, మంచినీరు, ప్రభుత్వ భవనాల్ని పూర్తి చేశారు. కానీ, తాము కోరిన పరిహారం ఇవ్వందే.. అక్కన్నుంచి కదిలేది లేదని ఊరుఊరంతా భీష్మించుకుని కూర్చుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం అందించి...పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం